అమెరికాలోని న్యూయార్క్ మహా నగరంలో జగనాథుడి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. న్యూయార్క్ ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో భక్తులంతా భారతీయ సంప్రదాయ వస్త్రధారణ చేసి ఈ రథయాత్రలో పాల్గొన్నారు. జగన్నాథుడి రథాన్ని పసుపు, ఎరుపు రంగుల్లో సుందరంగా అలకరించారు. న్యూయార్క్‌లోని 5 అవెన్యూ ఈ45 స్ట్రీట్ నుంచి డబ్ల్యూ 8 స్ట్రీట్ వరకు జరిగిన ఈ మహోత్సవంలో దాదాపు లక్ష మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలను ఉత్సవంగా తీసుకువెళ్లే రథాలను లాగేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. హరే కృష్ణా హరే కృష్ణా, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. ఆ తరువాత వాషింగ్టన్ స్క్వేర్ పార్క్ దగ్గర మహా ప్రసాదాన్ని భక్తులకు అందించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. వారితో పాటు అమెరికా, ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రజలు కూడా ఇందులో భాగస్వాములయ్యారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-95.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-94.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-96.jpg)