హిరోషిమా కు చెందిన తోషిసుకె కనజావా ఇటీవల తన 90వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ మరుసటిరోజే బాడీబిల్డింగ్ లో 19వ సారి జాతీయ టైటిల్ విజేతగా నిలిచారు. తొమ్మిది పదుల వయసులోనూ నిత్యం జిమ్లో కసరత్తులు చేస్తూ, బరువులు ఎత్తుతున్న కనజావా ఆల్ జపాన్ మాస్టర్స్ ఫిట్నెస్ ఛాంపియన్షిప్ పోటీలో 85 ఏళ్లు పైబడ్డ విభాగంలో ఈ ఘనత సాధించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తాను మాంసం, చేపలు మానేశానని చెప్పారు. 50 ఏళ్ల వయసులో బాడీబిల్డింగులోకి తిరిగి అడుగుపెట్టాక పూర్తిగా శాకాహారిగా ఉంటున్నానని అన్నారు.

ఎక్కువగా సోయాచిక్కుడుతో చేసే జపాన్ వంటకాలైన నాటో, మిసో సూప్తోపాటు ప్రొటీన్ సప్లిమెంట్లు తీసుకుంటానని చెప్పారు. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో బ్రౌన్రైస్తోపాటు కొద్దిగా ఫ్యూరీకేక్ (ఎండిన సముద్రపు నాచు, నువ్వుల పొడి) తింటా అని కనజావా వివరించారు. పులియబెట్టిన ఆహారాలైన నాటో, మిసో కూడా తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇవి పేగు ఆరోగ్యాన్ని కాపాడి, ప్రయోజకనకరమైన పోషకాలు అందిస్తాయన్నారు.















