లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా జయహో రామానుజ. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్‌లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ, సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ జూలై 12న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర నటుడు, దర్శకుడు సాయి వెంకట్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐకమత్యంతో జీవించాలని, మహిళలను గౌరవించాలని గొప్ప సందేశాన్నందించిన భగవత్ శ్రీరామానుజాచార్యుల వారి గురించి నేటి తరానికి తెలియ జెప్పే చిత్రమిది అన్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమాను తెరకెక్కించామని నిర్మాతలు సాయిప్రసన్న, ప్రవళ్లిక తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణమాచార్యులు, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నిర్మాత ఉషారాణి, దర్శకుడు రేలంగి నరసింహారావు, బీసీ కమీషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్, టీడీపీ నాయకురాలు జ్యోత్స్న, పొలిటికల్ లీడర్ వేణుగోపాలాచారి, నిర్మాత-నటుడు గురురాజ్, చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.