తన ప్రియురాలు లారెన్ శాంచెజ్‌తో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ జంట కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఫ్రాన్స్‌లో ఉన్నారు. ఈ సందర్భంగా లారెన్ ఓ హార్ట్ షేప్‌లో ఉన్న రింగ్‌ను ధరించి కనిపించింది. ఆమె చేతికి ఉన్నది ఎంగేజ్మెంట్ రింగ్ అయ్యి ఉంటుంది.

మాజీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అయిన 53 ఏళ్ల సాంచెజ్, 59 ఏళ్ల బెజోస్ 2018 నుంచి డేటింగ్ లో ఉన్నారు. జెఫ్ బెజోస్ తన మొదటి భార్య మెకెంజీ స్కాట్ తో 25 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 2019లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బెజోస్-లారెన్ తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈ క్రమంలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే తాజాగా వీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అమెజాన్ సీఈవో బాధ్యతల నుంచి 2021లో వైదొలిగిన జెఫ్ బెజోస్.. సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.
















