జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి ఘన విజయం సాధించింది. హేమంత్ సొరేన్‌కు జార్ఖండ్ జనం మళ్లీ పట్టం కట్టారు. అరెస్టుతో కలిసొచ్చిన సానుభూతి, ఆదివాసీల అండ, అమలు చేసిన పథకాలు జేఎంఎం కూటమికి ఓట్లు కురిపించాయి. ఎన్డీఏ కూటమిదే అధికారం అని చెప్పిన ఎగ్జిట్ పోల్స్ పటాపంచలయ్యాయి. 56 స్థానాలతో జేఎంఎం కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చింది. జార్ఖండ్‌లో గెలుపు కోసం బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కేవలం 24 స్థానాలతో మరోసారి ప్రతిపక్షానికి పరిమితమైంది.
జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా జేఎంఎం కూటమి 56 స్థానాల్లో విజయం సాధించింది. 43 నియోజకవర్గాల్లో పోటీ చేసిన జేఎంఎం ఏకంగా 34 స్థానాలను గెలుచుకుంది. 30 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 16 సీట్లలో విజయం సాధించింది. కూటమిలో భాగంగా ఆరు స్థానాల్లో పోటీ చేసిన ఆర్జేడీ నాలుగింటిలో, నాలుగు స్థానాల్లో బరిలో నిలిచిన సీపీఐ(ఎంఎల్)(ఎల్) రెండు స్థానాలను దక్కించుకున్నాయి.