అమెరికాలో చట్టబద్ధమైన హోదా లేని లక్షలాది మంది వలసదారులకు ఉపశమనం కల్పిస్తూ ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా పౌరుల విదేశీ జీవిత భాగస్వాములు, వారి పిల్లలకు దేశ పౌరసత్వం కల్పించనున్నట్టు వెల్లడించారు. దాదాపు 5 లక్షల మందికి ఈ నిర్ణయం ద్వారా ప్రయో జనం చేకూరనున్నట్టు అంచనా. వేలాది మంది భారతీయులకు కూడా ఇది లబ్ధి చేకూర్చనున్నది. విదేశీ జీవిత భాగస్వాములు కలిగిన అమెరికా పౌరులు, వారి పిల్లలు కలిసి ఉండేలా చర్యలు తీసుకోవాని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి బైడెన్ ఆదేశాలు జారీచేశారు. లీగల్ స్టేటస్ లేకుండా ఉంటున్న అమెరికా పౌరుల జీవిత భాగస్వామ్యులకు శాశ్వత నివాసానికి, పౌరసత్వానికి దరఖాస్తు చేసుకొనే అవకాశం ప్రభుత్వం కల్పించనున్నదని వైట్‌హౌస్ ప్రకటించింది.
బైడెన్ కొత్త ప్రణాళిక ప్రకారం వేలాది మంది భారత సంతతి అమెరికన్లతో సహా దాదాపు 5 లక్షల మంది వలసదారులు అమెరికా పౌరసత్వం పొందుతారని వైట్‌హౌస్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. దరఖా స్తు చేసేందుకు అర్హత పొందాలంటే, ఒక వలసదారు సోమవారం నాటికి అమెరికాలో 10 ఏండ్లు నివాసం ఉండటంతోపాటు అమెరికా పౌరుడిని వివాహం చేసుకొని ఉండాలి. క్వాలిఫై అయిన వలసదారు దరఖాస్తు ఆమోదం తర్వాత, అతను లేదా ఆమె గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొనేందుకు, తాత్కాలిక వర్క్ పర్మిట్ పొందేందుకు, బహిష్కరణ నుంచి రక్షణ పొందేందుకు మూడేండ్ల సమయం ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి.