సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ కాలం నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి సీజేఐగా సంజీవ్ ఖన్నా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆరు నెలలు మాత్రమే ఉంటారు. ఆయన 2025 మే 13న పదవీ విరమణ చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ తదితరులు హాజరయ్యారు.
న్యూఢిల్లీలో 1960, మే 14న జన్మించిన సంజీవ్ ఖన్నా ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్ లా సెంటర్‌లో న్యాయశాస్ర్తాన్ని చదివారు. ఢిల్లీ హైకోర్టులో 2005లో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2006లో శాశ్వత జడ్జి అయ్యారు. 2019, జనవరి 18న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన పలు ప్రముఖ తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఎన్నికల బాండ్లను రద్దు చేయడం, ఈవీఎంలు విశ్వసనీయమైనవని ప్రకటించడం, 370 అధికరణ రద్దును సమర్థించడం, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం లాంటి కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్ ఖన్నా భాగస్వామిగా ఉన్నారు.