ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీ దత్ నిర్మిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న సినిమా విడుదల కానుంది. ఈ పాన్ ఇండియా సినిమా ప్రమోషన్స్ మొదలైన నాటి నుంచీ, సినిమాలోని ఒక్కో ప్రధాన పాత్రనూ రివీల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్. ఇందులో ప్రభాస్ భైరవ గా నటిస్తున్న విషయం తెలిసిందే. భైరవ మిత్రుడైన బుజ్జి పాత్రను హైదరాబాద్ ఆర్‌ఎఫ్‌సీలో ఓ ప్రత్యేక ఈవెంట్‌ని ఏర్పాటు చేసి, విభిన్నంగా బుజ్జి కేరక్టర్‌ను చిత్ర బృందం రివీల్ చేశారు. బుజ్జి అంటే కల్కి 2898ఏడీ సినిమాలో ప్రభాస్ నడిపే కారు. ఆ సినిమాకోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఆ కారును ప్రభాస్ నడుపుకుంటూ రివీలయ్యారు. ప్రభాస్ మాట్లాడుతూ మూడేళ్లు బుజ్జితో ప్రయాణం చేశాను. బుజ్జి, భైరవ ప్రయాణం ఎైగ్జెటింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాలో బుజ్జిది చాలా ఇంపార్టెంట్ రోల్ అన్నారు. దేశాన్ని ప్రభావితం చేసిన నటులు అమితాబ్‌సార్, కమల్‌సార్.
ఇద్దరు లివింగ్ లెజెండ్స్‌తో పనిచేసే అవకాశం ఇచ్చిన వైజయంతీ మూవీస్‌కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆ విషయంలో నిజంగా నేను అదృష్టవంతుడ్ని. అలాగే దీపిక, దిషాపటాని వీరందరూ నా ఫిల్మ్‌లో భాగం అవ్వడం అశ్వనీదత్‌గారు నాకిచ్చిన గిఫ్ట్. ఆయన అంత పాషన్, ధైర్యం ఉన్న నిర్మాతను నేను చూడలేదు. ఆ తండ్రిలోని పేషన్‌ని, ధైర్యాన్ని పుణికిపుచ్చుకున్నారు స్వప్న, ప్రియాంక. వీళ్లందరి కృషే కల్కి 2898. వచ్చే నెల 27 తర్వాత మళ్లీ కలుద్దాం. లవ్‌యూ డార్లింగ్స్ అంటూ అభిమానులకు అభివాదం చేశారు ప్రభాస్. బుజ్జి పేరు చిన్నగా అనిపించినా సమ్‌థింగ్ స్పెషల్. ఇంజినీరింగ్ చేయకుండానే ఇంజనీర్లుగా మారిపోయి ఈ కారు తయారు చేశాం. ఆనంద్ మహేంద్రగారు ఆయన టీమ్ సహకారంతో ఇది జరిగింది. బుజ్జి ఓ మ్యాజిక్ అని దర్శకుడు నాగ్‌అశ్విన్ అన్నారు. ఇంకా నిర్మాత అశ్వనీదత్‌తో పాటు చిత్ర యూనిట్ మొత్తం పాల్గొన్న ఈ కార్యక్రమానికి వేలాదిగా అభిమానులు తరలివచ్చారు.