నవంబర్‌లో జరిగే అగ్రరాజ్య ఎన్నికల సందర్భంగా జరిగిన డిబేట్‌లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్ట్ ట్రంప్ తొలిసారిగా ముఖాముఖీ తలపడ్డారు. గత డిబేట్‌లో ట్రంప్ వైపే స్పష్టంగా మద్దతు చూపిన మీడియా, ఈసారి మాత్రం కమలా హారిస్‌కు ఎడ్జ్ ఇచ్చింది. వీరిరువురికి మధ్య జరిగిన సంవాదంలో ఆర్థిక వ్యవస్థ, గర్భ విచ్ఛిత్తి నుంచి వలస విధానం వరకు పలు అంశాలపై వాడీవేడి గా చర్చ జరిగింది. 90 నిముషాల పాటు జరిగిన ఈ చర్చలో హారిస్ కొన్ని సమయాల్లో సంభాషణను నియంత్రించారు. ట్రంప్‌ను అతని ఆర్థిక విధానంలోని లోపాలను ఎత్తి చూపారు.
అలాగే 2020 ఎన్నికల్లో పరాజయాన్ని ట్రంప్ అంగీకరించడానికి నిరాకరించడం, సభలలో అతని వ్యవహార శైలిపై చురకలంటించారు. అయితే ట్రంప్ పలుసార్లు అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. సమయం గడిచే కొద్దీ ఆయనలో చికాకు కన్పించింది. హారిస్ ఆరోపణలను సమర్థించుకోవడానికి ఎక్కువ సమయం కేటాయించినట్టు కన్పించగా, హారిస్‌లో దృఢ విశ్వాసం, దూరదృష్టి కన్పించాయని పలువురు వ్యాఖ్యాతలు పేర్కొన్నారు.