బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనారనౌత్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం చంద్రముఖి-2. రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటిస్తున్నారు. పి.వాసు దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వడివేలు, లక్ష్మీమీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, విఘ్నేష్ రవి తదితరులు నటిస్తున్నారు. చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. సంప్రదాయ పట్టుచీరలో ఒంటినిండా బంగారు ఆభరణాలు ధరించి రాజసంతో కనిపిస్తున్నది కంగనా రనౌత్. ఈ చిత్రంలో అందం, రాజసం, అధికారం మూర్తీభవించిన చంద్రముఖి పాత్రలో కంగనా రనౌత్ అభినయం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అని చిత్రబృందం పేర్కొంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్, ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి.