అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు రిపబ్లికన్ నేత కెవిన్ మెకార్థి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 15వ రౌండ్ ఓటింగ్ తర్వాత ఆయన స్పీకర్‌గా గెలిచారు. స్పీకర్ ఎన్నిక కోసం 428 మంది ఓటేశారు. దాంట్లో మెకార్థికి 216 ఓట్లు రాగా, డెమోక్రటిక్ అభ్యర్థి హకీమ్ జెఫ్రిజస్‌కు 212 ఓట్లు పోలయ్యాయి. కెవిన్‌కు మెజారిటీ వచ్చిందని, ఆయనే హౌజ్ స్పీకర్ అని క్లర్క్ చెర్లి జాన్సన్ ప్రకటించారు.
నిజానికి హౌజ్‌లో రిపబ్లికన్ల ఆధితప్యం ఉన్నా, కొందరు రెబల్స్ వల్ల కెవిన్ తీవ్ర పోరాటం చేయాల్సి వచ్చింది. స్పీకర్ ఎన్నిక కోసం నాలుగు రోజులుగా ఓటింగ్ జరుగుతోంది. కెవిన్‌కు మద్దతు ఇచ్చేందుకు రిపబ్లికన్ రెబల్స్ వెనుకాడారు. దీంతో స్పీకర్ ఎన్నికలో ప్రతిష్టంభన ఏర్పడింది. చిట్టచివరకు మెకార్థి 216 ఓట్లతో హౌజ్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
మెకార్థి గెలవగానే రిపబ్లిక్లను హర్షధ్వానాలతో సభలో హోరెత్తించారు. యూఎస్ఏ, యూఎస్ఏ అంటూ రిపబ్లికన్లు అరిచారు. హౌజ్ ఎజెండా, లెజిస్లేటివ్ బిజినెస్ మొత్తం స్పీకర్ ఆధీనంలో ఉంటుంది. దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలి తర్వాత హోదాలో స్పీకర్ నిలుస్తారు.హౌజ్ స్పీకర్‌గా ఎన్నికైన మెకార్థికి మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కంగ్రాట్స్ తెలిపారు.