బ్రిటన్‌లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ కి ఓటమి ఖాయమంటూ అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్న తరుణంలో ఆ దేశ ప్రధాన మంత్రి రిషి సునాక్ కీలక ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల తేదీలపై జరుగుతున్న ప్రచారానికి ముగింపు పలికారు. జూలై 4న దేశంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీనికి అనుగుణంగా త్వరలోనే పార్లమెంట్‌ను కూడా రద్దు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద వర్షంలో తడుస్తూనే ఆయన ఈ ప్రకటన చేశారు.
బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చింది. ఆర్థిక మంత్రిగా, ప్రధాన మంత్రిగా ఎన్నో విజయాలను సాధించాం. దేశ ప్రజల రక్షణ కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. దేశాధినేత కింగ్ చార్లెస్ IIIతో మాట్లాడాను. పార్లమెంట్‌ను రద్దు చేయమని అభ్యర్థించాను. ఇందుకు రాజు కూడా అనుమతించారు. జూలై 4న దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి అని రిషి సునాక్ వెల్లడించారు.