ఖమ్మం, నల్గోండ, కరీంనగర్ జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా ఉన్నాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అయితే తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ ఇంకా తగ్గలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు. పాజిటివ్ ఉన్నా, కొందరు రోడ్లపై ఇష్టారీతిన తిరుగుతున్నారని తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్రంలోకి థర్డ్‌వేవ్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారినే హోటల్స్, మాల్స్‌లోకి అనుమతించే విషయాన్ని కూడా తాము పరిశీలిస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో రెండు డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1.12 కోట్ల మందికి మొదటి డోసు వ్యాక్సిన్ ఇచ్చామని, 33.79 లక్షల మందికి రెండో డోస్ కూడా ఇచ్చామని శ్రీనివాస్ తెలిపారు.