సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కాఫీ విత్ ఏ కిల్లర్. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ హీరోహీరోయిన్ లేకుండా ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి ఈ కథ పుట్టింది. ఈ సినిమాకు కథే హీరో. నా ఆలోచనలను అర్థం చేసుకునే తిరుమల నాగ్తో కలిసి ఈ సినిమాకు పనిచేశాను. ఈ సినిమాలోని పాత్రలన్నీ కొత్త ఉంటాయి. ఇందులో హీరోహీరోయిన్లు ఉండరు. విలన్ ఉంటాడు. ఓ కొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది. అందరం కలిసి శ్రద్ధగా పనిచేశాం. డీవోపీ అనూష్ అద్భుతమైన పనితనాన్ని ఈ సినిమాలో చూడొచ్చు. ఈ సినిమాను థియేటర్లో విడుదల చేయాలని చాలామంది కోరారు. కానీ పట్టుబట్టి మేమే ఓటీటీలో విడుదల చేస్తున్నాం అని తెలిపారు. ఇంకా నిర్మాత సెవన్హిల్స్ సతీష్తోపాటు ఇందులో ప్రధాన పాత్రధారులైన నటులు జెమినీ సురేశ్, అంబటి శ్రీను, శ్రీనివాస్రెడ్డి, టెంపర్ వంశీ, నటి శ్రీరాప కూడా మాట్లాడారు.
