రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లీడ్ రోల్స్‌లో తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం కోట బొమ్మాళి పీఎస్. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను కోట బొమ్మాళి పీఎస్ ప్రచార సభ పేరుతో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అరవింద్ మాట్లాడుతూ ఈ సినిమా కథలో ప్రత్యేకం ఏమిటంటే.. పోలీస్ చేజేస్ పోలీస్. పోలీసులని పోలీసులు పట్టుకోవాలనే ఒక విచిత్రమైన కథ. ఈ సినిమాలో ఎవరూ హీరోలు లేరు. కథే హీరోగా వెళుతుంటుంది. తప్పకుండా ఈ వెరైటీని ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు. బోయపాటి శ్రీను మాట్లాడుతూ కోట బొమ్మాళి సినిమా గురించి చెప్పాలంటే లింగిడి లింగిడి సాంగ్ ప్రతి ఒక్కరికీ చేరింది అనేది నిజం. ఈ సాంగ్ ప్రతి ఒక్కరి మైండ్‌లోకి, హార్ట్‌లోకి వెళ్లి కూర్చుంది. కాబట్టి ఈ పాట సినిమాకు అద్భుతమైన ప్లస్. ఒక డైలాగ్, విజువల్స్, పంచ్, టీజర్, ట్రైలర్ సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇక్కడ ట్రైలర్‌తో పని లేకుండా ఈ సాంగ్ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చింది. ఇక కోటబొమ్మాళి ప్రచార సభ అని మొదలెట్టిన ఈ ఎలక్షన్‌లో రేపు ఖచ్చితంగా విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను అని తెలిపారు.
చిత్ర దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ ఈ సినిమా కథ విషయానికి వస్తే, పోలీస్ ఛేజింగ్ పోలీస్. ఇప్పుడున్న సిస్టమ్‌లో పోలీసులు ఎలా నలిగిపోతున్నారనేది చూపించాలనుకున్నాం. ఒక పొలిటీషియన్ చేతుల్లో పోలీసులు ఎలా కీలుబొమ్మలుగా మారుతున్నారనేది చూపించాం అని చెప్పారు.