తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు అన్నీ పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే కొన్ని జిల్లాల్లో వర్షాల కారణంగా రోడ్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. వంతెనలు కూడా తెగిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. గడచిన 24 గంటల్లో 12 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం పడింది. 14 చోట్ల 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మంచిర్యాల, మెదక్, ఖమ్మం, కామారెడ్డి, నల్లగొండ, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. ఉమ్మడి కరీనంగర్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జగిత్యాలలో అత్యధికంగా 145.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్లాలో 110.5 మి.మీ. వర్షపాంతం నమోదైంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వరద నీరు కారణంగా పంట పొలాలు కూడా నీటిలో మునిగిపోయాయి. శ్రీరాం సాగర్, కడెం ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 53.54 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టుకు కూడా 18,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో 17000 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. మూసీ నది కూడా పొంగిపొర్లుతోంది. దీంతో నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 1,872.64 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 4,597 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.
హైదరాబాద్ సిటీలో నీట మునిగిన కాలనీలు
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ విపరీతమైన వర్షం పడింది. దీంతో పలు కాలనీలు నీట మునిగిపోయాయి. వీధులన్నీ నదుల్లా కనిపించాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోయారు. ముఖ్యంగా దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, జూబ్లీ, బంజారాహిల్స్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. నాగోల్ పరిధిలోని బండ్లగూడలో అత్యధికంగా 21.2 సెంటీమీటర్ల వర్షపాత నమోదైంది. వనస్థలిపురంలో 19.2 సెంమీ, హయత్ నగర్‌లో 17.1 సెం.మీ. రామంతాపూర్‌లో 17.1 సెం.మీ. ఎల్బీనగర్‌లో 14.9 సెం.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొన్నారు.
సమస్యలు వస్తే టోల్‌ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలంటూ కేటీఆర్ ట్వీట్
రాష్ట్ర వ్యాప్తంగా వానలు విపరీతంగా పడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మున్సిపల్ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఆర్‌ఎఫ్ బృందాలు, అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా సమస్యలు వస్తే 100 లేదా 040-29555500 నెంబర్లకు కాల్ చేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.