కువైత్ ప్రభుత్వం తాజాగా మరో కొత్త రూల్ తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ఇకపై తప్పనిసరిగా ప్రొఫెషనల్ టెస్ట్ నిర్వహించనున్నట్లు వెల్లడిరచింది. దీనికోసం ప్రత్యేకంగా డెమొగ్రఫిక్ కమిటీ అండ్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం సివిల్ సర్వీస్ కమిషన్, కువైత్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ మధ్య అన్ని స్పెషలైజేషన్లలోని కార్మికుల సామర్థ్యాన్ని నిర్ధారించడానికి ప్రొఫెషనల్ టెస్ట్‌లను నిర్వహించడంపై ప్రత్యేక ఒప్పందం కుదిరిందని తెలిపింది. అలాగే అవసరాలకు అనుగుణంగా లేని కార్మికులందరినీ తిరస్కరించడం జరుగుతుందని నివేదిక స్పష్టం చేసింది. కొత్తగా వచ్చే వర్కర్లకు మాత్రమే పరీక్ష ఉంటుందని, అయితే భవిష్యత్తులో ప్రవాసులందరికీ పరీక్షలు నిర్వహించబడతాయని పేర్కొంది.
