తెలంగాణలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పట్టణాలతో పాటు మూరుమూల పల్లెల్లోనూ వ్యవసాయ భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. బహిరంగ మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగినందు వల్లే విలువలను పెంచుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు, సాగు నీటి ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంలో భూముల రేట్లు పెరిగాయని తెలిపింది. ఈ విలువ గురువారం నుంచే అందుబాటులోకి వస్తుందని సీఎస్ సోమేశ్ కుమార్ ప్రకటించారు. మార్కెట్ ఆస్తులపై 50 శాతం, మధ్యలో ఉన్న భూములపై 40 శాతం, ఎక్కువగా ఉన్న వాటికి 30 చొప్పున పెంచింది. అయితే ఇప్పటి వరకూ భూముల రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే స్లాట్‌లు బుక్ చేసుకున్న వారికి కూడా కొత్త రేట్లు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యవసాయ భూములకు కనిష్ఠ విలువ ఎకరాకు 75 వేలుగా నిర్ణయించారు. అదే ఓపెన్ ప్లాట్ల కనిష్ఠ విలువ చదరపు గజానికి 200 రూపాయలకు పెంచారు. కొన్ని రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో భూముల విలువలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. దీంతో భూముల విలువలను పెంచడం ద్వారా ఓ ఆదాయ వనరు దొరికినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.