సింగపూర్‌లో ప్రముఖ చెస్ శిక్షణ సంస్థ అయిన “లెర్న్ చెస్ అకాడమీ”(Learn Chess Academy) మే 1వ తేదీన వార్షిక చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా యువ చెస్ ప్రతిభను పెంపొందించే ప్రయత్నం చేసారు. ఈ టోర్నమెంట్‌లో 6 నుండి 15 సంవత్సరాల వయస్కులైన సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారు ఐదు విభాగాలలో పోటీపడ్డారు: అండర్ 6, 8, 10, 12 మరియు అబౌవ్ 13.
అపార అనుభవం కలిగిన ప్రొఫెషనల్ చెస్ కోచ్ మురళి కృష్ణ చిత్రాద స్థాపించిన ఈ “లెర్న్ చెస్ అకాడమీ”, 15 సంవత్సరాల నుండి నిరంతరంగా చిన్న పిల్లలకు మరియు యువకులకు చదరంగం ఆటలో శిక్షణ ఇస్తోంది. ఈ టోర్నమెంట్ కేవలం పోటీకి మాత్రమే కాకుండా, విద్యార్థులు తమ వ్యూహాత్మక నైపుణ్యాలను ప్రదర్శించే వేదికగా కూడా నిలిచింది.
ఈ కార్యక్రమం బహుమతి పంపిణీ కార్యక్రమంలో, టాటా ఇంటర్నేషనల్ సింగపూర్ ఛైర్మన్ మరియు ఏసియన్ ఫార్మర్ రెసిడెంట్ డైరెక్టర్, ది సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ (SINDA) టర్మ్ ట్రస్టీ, సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (SIFAS) అధ్యక్షుడు, అయిన కె.వి.రావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా అనుజ్ ఖన్నా సోహమ్, AFFLE గ్రూప్ వ్యవస్థాపకుడు పాల్గొన్నారు.
విద్యార్థుల విభిన్న ప్రతిభలను ప్రదర్శించేలా రూపొందించబడిన వివిధ వినోదాత్మక కార్యక్రమాలతో, ఈ కార్యక్రమం సుసంపన్నం చేయబడింది. ముఖ్యంగా విద్యార్థులు ప్రదర్శించిన చెస్ థీమ్ స్కిట్, రూబిక్స్ క్యూబ్ పరిష్కరించడం వంటి నైపుణ్యాలను ప్రదర్శించే టాలెంట్ షో, ప్రత్యేకమైన క్యాలెండర్ గేమ్ మరియు ఆకట్టుపరిచే క్విజ్‌లు ఉన్నాయి.
యువతలో సమస్యా పరిష్కార నైపుణ్యాలను మరియు నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు అభివృద్ధి చేయడంలో చెస్ యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతూ మురళి కృష్ణ చిత్రాడ ముఖ్య ప్రసంగం చేశారు.
“సౌందర్య కనగాల” యాంకర్‌గా వ్యవహరించి సభను రక్తి కట్టించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ నాగేష్ మరియు గోపి చిరుమామిళ్ల వంటి ప్రముఖులు విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేసారు.