అక్రమ వలసదారులకు పాకిస్థాన్ వార్నింగ్ ఇచ్చింది. నవంబర్ 1లోగా దేశం నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని అల్టిమేటమ్ జారీ చేసింది. లేనిపక్షంలో వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే అక్రమ వలసదారులకు షెల్టర్ ఇచ్చిన వారిని చట్టపరంగా శిక్షిస్తామని పేర్కొంది. ఆ దేశ తాత్కాలిక అంతర్గత మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటించింది. పాకిస్థాన్‌లోని వేలాది మంది ఆఫ్ఘన్ జాతీయులతో సహా అక్రమంగా దేశంలో ఉంటున్న వలసదారులంతా నవంబర్ 1 గడువు కంటే ముందే స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని తాత్కాలిక అంతర్గత మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. నవంబరు 1 తర్వాత పత్రాలు లేని వలసదారులందరినీ తొలగించే ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పాకిస్థాన్ కృతనిశ్చయంతో ఉందని మీడియాతో అన్నారు. అక్రమ వలసదారులను గుర్తించామని, వారి సమాచారం తమ వద్ద ఉందని వెల్లడించారు. స్వచ్ఛందంగా వెళ్లే వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)