సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ హాస్యనటుడు కడలి జయసారథి కన్నుమూశారు. ఆయన వయసు 83 ఏళ్లు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచారు. నాటకరంగంలో గుర్తింపు పొందిన జయసారథి..రేలంగి, స్థానం నరసింహారావు, పద్మనాభం వంటి వారితో కలిసి నటించారు. 1960లో తెరకెక్కిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రంతో చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.విలక్షణ హాస్య శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్న జయసారథి తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్నారు. నటప్రయాణంలో 372 చిత్రాల్లో నటించారు. ‘పరమానందయ్య శిష్యుల కథ’.‘భక్త కన్నప్ప’,‘అమరదీపం’,‘జగన్మోహిని’,‘ముత్యాల ముగ్గు’ వంటి చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి.
నిర్మాతగా అభిరుచి చాటుకున్న ఆయన ‘ధర్మాత్ముడు’, ‘అగ్గిరాజు’,‘శ్రీరామచంద్రుడు’వంటి చిత్రాలను నిర్మించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యుడైన జయసారథి, సినీ కార్మికుల ఆవాసమైన చిత్రపురి కాలనీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్ సినీకార్మికుల సంస్థకు వ్యవస్థాపక కోశాధికారిగా ఉన్నారు. ఆయన అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ముగిశాయి. జయసారథి మృతి పట్ల పలువురు తెలుగు సినీ ప్రముఖులు, నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.














