యాపిల్‌పై ట్విట్టర్ నూతన అధిపతి ఎలాన్ మస్క్ తీవ్రవస్థాయిలో ధ్వజమెత్తారు. యాపిల్ యాప్ స్టోర్ ద్వారా జరుగుతున్న లావాదేవీలపై రహస్యంగా 30 శాతం ఫీజును వసూలు చేస్తున్నదని ఆరోపించారు. ఇకపై యాపిల్‌కు 30 శాతం చెల్లింపులను కొనసాగించడానికి బదులుగా ఆ సంస్థతో యుద్ధం చేస్తానని ప్రకటించారు. యాపిల్ యాప్ స్టోర్ నుంచి ట్విట్టర్‌ను తొలగిస్తామని బెదిరిస్తున్నదని, ట్విట్టర్‌లో యాపిల్ ప్రకటనలను నిలిపివేసిందని ఆరోపించారు. ట్విట్టర్‌కు ప్రకటనల ద్వారా వస్తున్న ఆదాయంలో అధిక భాగం యాపిల్ నుంచే వస్తున్నది. యాపిల్ యాప్ స్టోర్ ద్వారా దాదాపు 150 కోట్ల పరికరాల్లో ట్విట్టర్‌ను వినియోగిస్తున్నారు.