రాదనుకున్న తెలంగాణను సాధించినట్టే, భవిష్యత్తులో ఎర్రకోటపై బీఆర్‌ఎస్ జెండా ఎగరడం ఖాయమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో మార్పును చూపెట్టినట్టే దేశంలో పరివర్తన తెచ్చేందుకే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఏర్పాటైందని తెలిపారు. ఎవరెంత హేళన చేసినా స్థిర సంకల్పంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, ఎనిమిదేండ్లలోనే అద్భుత పురోగతితో దేశానికే మార్గనిర్దేశం చేసే స్థాయికి ఎదిగామని చెప్పారు. ఇప్పుడు ఇదే స్ఫూర్తితో దేశంలో ఉత్తమ, గుణాత్మక మార్పు కోసం, ఉన్నత స్థాయికి చేరుకొనే ఆర్థిక పరిపుష్టి కోసం కొట్లాడుదామని పిలుపునిచ్చారు.

ఒకప్పుడు ఎడారిగా ఉన్న తెలంగాణ ఎనిమిదేండ్లలోనే ఇంతగా మారితే.. రత్నగర్భగా ఉన్న మనదేశాన్ని ఎంతలా మార్చవచ్చో ఆలోచించాలని కోరారు. ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ బీఆర్‌ఎస్ నినాదమని ప్రకటించారు. కర్ణాటకలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలే బీఆర్‌ఎస్ తొలి టాస్క్‌గా అభివర్ణించారు. కేంద్రంలో అధికారం చెలాయించిన పార్టీల అసంబద్ధ విధానాల వల్లనే ప్రస్తుతం దేశంలో అంధకార పరిస్థితులు నెలకొన్నాయని.. బీఆర్‌ఎస్ ద్వారా ఆ కారుచీకట్లను తొలిగించే చైతన్య దీపం వెలిగిద్దామని పిలుపునిచ్చారు. దేశ సమగ్రాభివృద్ధి కోసం కొత్త పాలసీలు రూపొందిస్తున్నామని, త్వరలోనే వాటిని దేశ ప్రజల ముందు పెడతామని చెప్పారు. 14న ఢిల్లీలో బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.