పరస్పరం విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ కలిసికట్టుగా ముందుకు సాగుదామంటూ షాంఘై సహకార సంస్థ (ఎన్‌సీవో) సదస్సులో సభ్య దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో ఎన్‌సీవో శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ సంక్షోభాల వల్ల అంతర్జాతీయంగా సరఫరా గొలుసులు దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా ప్రపంచం మునుపెన్నడూ లేనంతగా ఇంధన, ఆహార సంక్షోభాలను ఎదుర్కోంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా నివారించేందుకు పటిష్ట సరఫరా గొలుసులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవశ్యకతను నొక్కిచెప్పారు. ఎస్‌సీవో సభ్యదేశాల మధ్య మెరుగైన అనుసంధానత ఉండాలని రవాణా సదుపాయాలు మరింత స్వేచ్ఛాయుతంగా మారాలని ఆకాంక్షించారు.
ప్రాంతీయంగా మనం పటిష్ఠ, విశ్వసనీయ సరఫరా గొలుసుకులను ఏర్పాటు చేసుకోవాలి అని సాకారం కావాలంటే ఎస్‌సీవో సభ్యదేశాల మధ్య మెరుగైన అనుసంధానత అవసరం. మన మధ్య రవాణా సదుపాయాలకు సంబంధించి సంపూర్ణ హక్కులు ఉండటమూ చాలా కీలకం అని మోదీ పేర్కొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యానికి అవసరమైన రవాణా సదుపాయాలను కల్పించడంలో పాక్ విముఖత చూపుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.