సాహిత్యానికి, సినిమాకు మైత్రి కుదిరినప్పుడు వెండితెరపై అద్భుతాలు సృష్టించవొచ్చని, భారతీయ సినిమా మరింత వెలుగులీనాలంటే సాహిత్యం సినిమాలో ఓ భాగం కావాలన్నారు ప్రముఖ దర్శకుడు మణిరత్నం. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మణిరత్నం మాట్లాడుతూ సాహిత్యం దర్శకుడి ఆలోచనలను విస్తృతం చేస్తుంది, అతని పనితీరును మరింత గా మెరుగుపరుస్తుందని నమ్ముతాను. ప్రస్తుతం నేను సల్మాన్ రష్దీ రాసిన విక్టరీ సిటీ అనే నవల చదువుతు న్నా. విజయనగర సామ్రాజ్యపు తొలినాటి వైభవాన్ని ఈ నవలలో అద్భుతంగా ఆవిష్కంచారు. ఈ పుస్తకాన్ని చదువుతుంటే సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతున్నది.కాల్పనిక, వాస్తవిక, చారిత్రక అంశాలను కలబోసిన రష్దీ రచనాశైలి అద్భుతం అంటూ మణిరత్నం కొనియాడారు.
భారతీయ పురాణ ఇతివృత్తాల ఆధారంగానే తాను ఎక్కువ సినిమాలు తీశానని చెప్పారు. దళపతి, రావణ్ వంటి సినిమాలకు భారతీయ పురాణాలే స్ఫూర్తినిచ్చాయి. ఇండియన్ మైథాలజీ ఆధారంగా సమకాలీన సమస్యలను కూడా అవగతం చేసుకోవచ్చు. అనేక కథలను తెరకెక్కించవొచ్చు అని మణిరత్నం పేర్కొన్నారు.