తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసానికి సంబంధించి మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జయలలిత నివాసం పోయెస్ గార్డెన్‌ని స్మారక మందిరంగా మార్చడానికి వీలులేదని కోర్టు తెలిపింది. దీనిపై అన్నాడీఎంకే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కూడా న్యాయస్థానం కొట్టేసింది. జయలలిత ఆస్తులను స్వాదీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి హక్కులేదని స్పష్టం చేసింది. మూడు వారాల్లో పోయెస్ గార్డెన్‌ని జయలలిత మేన కోడలి దీపకి అప్పగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
జయలలిత 2016లో అనారోగ్యంతో కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆమె నివాసమైన పోయెస్ గార్డెన్‌ను స్మారక మందిరంగా మార్చాలని పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చాలా రోజుల తర్వాత వేద నిలయం ఆమె మేనకోడలు దీపకే చెందుతుందని హైకోర్టు తీర్పు వెలువరించింది.