Namaste NRI

మహాయుతిదే మహా పీఠం … బీజేపీకి హ్యాట్రిక్ విక్టరీ

మహాయుతికే మహారాష్ట్ర ప్రజలు జైకొట్టారు. హోరాహోరీ అనుకున్న పోరులో ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టా రు. 288 నియోజకవర్గాలకు గానూ 233 స్థానాల్లో గెలిపించి మళ్లీ అధికారంలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా వికాస్‌ అఘాడీకి దారుణ ఓటమిని మిగిల్చారు. లోక్‌సభ ఫలితాలను పునరావృతం చేసి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనుకున్న అఘాడీ కేవలం 49 స్థానాలకే పరిమితమైంది. 101 స్థానా ల్లో పోటీ చేసి కూటమిలో పెద్దన్న పాత్ర పోషించాలనుకున్న కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఆ పార్టీ అతి కష్టమ్మీద కేవలం 15 స్థానాలనే గెలుచుకుంది. మాజీ ముఖ్యమంత్రులు ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌కు ఎన్నికల ఫలితాలు రాజకీయంగా కోలుకోలేని దెబ్బకొట్టాయి. మహాయుతి హవాలో చిన్న పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ప్రతిపక్షంలో ఏ పార్టీకీ 10 శాతం సీట్లు దక్కకపోవడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయాయి.

 288 స్థానాలకు గానూ 233 స్థానాల్లో మహాయుతి అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ 149 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఏకంగా 132 స్థానాలను దక్కించుకుంది. 81 స్థానాల్లో పోటీ చేసిన సీఎం ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వం లోని శివసేన 57 స్థానాల్లో విజయం సాధించింది. అజిత్‌ పవార్‌ నాయకత్వంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ 59 స్థానాల్లో బరిలో నిలిచి 41 చోట్ల గెలిచింది. మహాయుతిలోని జన్‌ సురాజ్య శక్తి రెండు స్థానాల్లో, రాష్ట్రీయ యువ స్వాభిమాన్‌ పార్టీ ఒక స్థానంలో, రాజర్షి షాహు వికాస్‌ అఘాడీ ఒక స్థానంలో గెలుపొందాయి.

Social Share Spread Message

Latest News