పద్నాలుగు సంవత్సరాల తర్వాత నిర్వహిస్తోన్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల వేడుకను విజయవంతం చేయాలని ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ ఎరుగని విమాన ప్రమాదం నేడు జరిగింది. దేశమంతా దిగ్భ్రాంతికి లోనై ఉన్నది. నిజానికి ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రావాల్సివుంది. కానీ ఈ విషాదం వల్ల ఆయన రాలేకపోయారు. అందుకనే ఆయన తరఫున వివరాలు నేనే అందిస్తున్నా అన్నారు.

ఈ నెల 14న వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. 2014 నుంచి 2023 వరకూ ప్రతి ఏడాదీ ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాలుగా ఎంపికైన మూడు సినిమాలకు అవార్డులు ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రతి ఉత్తమ చిత్రానికీ హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత ఇలా నాలుగు కేటగిరీల్లో అవార్డులను అందిస్తాం. ఇక 2024కు సంబంధించి, అన్ని కేటగిరీలకూ చెందిన అవార్డులు ఉంటాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా కోరుతున్నాను అని దిల్‌రాజు చెప్పారు.
