జనతా వస్త్రాల పంపిణీ సందర్భంగా ఇటీవల గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహనకృష్ణ రూ.10 లక్షలను అందజేశారు. ఒక్కో కుటుంబానికి రూ.3,34,000 చొప్పున మొత్తం మూడు కుటుంబాలకు మన్నవ మోహనకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయాన్ని అందించారు. మాజీ మంత్రులు మాకినేని పెద్ద రతయ్య, ఆలపాటి రాజా, నక్కా ఆనంద బాబు, ఇతర సీనియర్ టీడీపీ నాయకుల చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మాట్లాడుతూ చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, భవిష్యత్తులోనూ బాధిత కుటుంబాలకు మన్నవ మోహనకృష్ణ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.