విమోచన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని పార్టీలు భయపడ్డాయని, ఇన్నాళ్లూ ఏ ప్రభుత్వమూ సాహసించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విమోచన దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత అమరవీరులకు అమిత్ షా నివాళలర్పించారు. ఆ తర్వాత సాయుధ బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సభలో అమిత్ షా మాట్లాడారు. హైదరాబాద్ రాష్ట్రానికి, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు సెప్టెంబర్ 17న స్వాతంత్య్రం వచ్చింది. సర్దార్ వల్లబభ్‌భాయ్ పటేల్ కృషితో నిజాం పాలన నుంచి ఈ ప్రాంతం ప్రజలకు విముక్తి లభించింది. దేశమంతటికీ స్వాతంత్రం వచ్చిన ఏడాది తర్వాత హైదరాబాద్ ప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఈ ఏడాది హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించాలని ప్రధాని మోదీ ఆదేశించారని చెప్పారు.
హైదరాబాద్ సంస్థానంలో జరిగిన ఆకృత్యాల డ్యాకుమెంటరీని దేశం నలుమూలలా ప్రదర్శిస్తాం. ఈ సంస్థానాన్ని భారత్‌లో కలపకుంటే గాంధీ కలలుగన్న స్వతంత్ర భారతదేశం కల నెరవేరేది కాదు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిరదో దాన్ని దాలికి వదిలేశారు అని విమర్శించారు.