
ప్రస్తుతం రవితేజ మాస్ జాతర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్నది. ఈ సినిమా తర్వాత రవితేజ సినిమా ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ విషయంలో కొత్త అప్‌డేట్‌ను అందించారు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత, నిర్మాత సూర్యదేవర నాగవంశీ. మాస్ జాతర పూర్తయ్యాక రవితేజతో తమ సంస్థ మరో సినిమా కూడా నిర్మిస్తుందని, అది సోషియో ఫాంటసీ జోనర్‌లో ఉంటుందని ఆయన వెల్లడించారు. దీంతో రవితేజ మరో భారీ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నారని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాస్ జాతర చిత్రం మే 9న విడుదలకానుంది. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమా రిలీజ్ కొంచెం ఆలస్యం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
