తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లి పట్టుమని పదిరోజులు కూడా కాకుండానే అఫ్గానిస్థాన్‌లో నెత్తుటేర్లు పారాయి. కాబూల్ బాంబులతో దద్దరిల్లింది. ఉగ్ర దాడితో హమీద్ కర్జాయ్ విమానాశ్రయం రక్తసిక్తమైంది. ఎయిర్‌పోర్టు లోని అబే గేట్ విమానాశ్రయం ఆవరణలోని బారోన్ హోటల్ వద్ద బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో కనీసం 60 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. మృతుల్లో పిల్లలు, విదేశీయులతోపాటు అమెరికా సైనికులు, తాలిబన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మాహుతి దాడుల అనంతరం ఉగ్రవాదులు కాల్పలకు తెగబడినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. జంట పేలుళ్లను అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ధ్రువీకరించింది.
అబే గేట్ వద్ద తొలి పేలుడు జరిగిన కొద్ది సేపట్లోనే హోటల్ సమీపంలో రెండో పేలుడు జరిగినట్టు పేర్కొంది. ఈ ఘటనలో డజను మంది అమెరికా సైనికులు మరణించగా, ముగ్గురు గాయపడ్డట్టు వెల్లడిరచింది. కాబూల్ పేలుళ్ల వెనుక ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) హస్తం ఉన్నట్టు అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తం ఉందని అనుమానిస్తున్నట్టు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.