మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అతి కీలకమైన ఘట్టం ఆవిష్కృతమయ్యింది. లక్షలాది మంది భక్తుల పారవశ్యం, శివసత్తుల పూనకాలు, గిరిజన యువతుల నృత్యాలు, డోలు వాయిద్యాలు, అధికార లాంఛనాల నడుమ సమ్మక్క మేడారం గద్దెలపై కొలువుదీరింది. చిలుకలగుట్ట నుంచి మేడారం గద్దెల వద్దకు చేరుకున్న సమ్మక్కను, ప్రధాన పూజారి కొక్కెర సమ్మయ్య రాత్రి 9:22 గంటల ప్రాంతంలో గద్దెలపై ప్రతిష్టించారు.
సమ్మక్కను మేడారం గద్దెలపైకి తీసుకొచ్చే ప్రక్రియ గురువారం ఉదయమే మొదలయ్యింది. ముందుగా వడ్డెలు చిలుకలగుట్ట అడవిలోకి వెళ్లి వనం (వెదురు కర్రలు ) తీసుకొచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సమ్మక్క పూజామందిరంలోని అడేరాలు (కొత్తకుండలు ) తీసుకొచ్చి గద్దెలపైకి చేర్చారు. అనంతరం చిలుకలగుట్టకు వెళ్లి ప్రధాని పూజారితో కలిసి కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొని మేడారం బయల్దేరారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క వనదేవతకు స్వాగతం పలికారు. ప్రభుత్వం తరఫున అధికార లాంఛనాల ప్రకారం ఎస్పీ పి.శబరీశ్ ఏకే-47 తుపాకీతో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి స్వాగతం పలికారు. చిలుకలగుట్ట నుంచి పోలీసుల బందోబస్తు నడుమ సమ్మక్కను గద్దెపైకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మేడారం మొత్తం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.