అమెరికా పర్యటనలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు టిడి జనార్ధన్, గాలి భాను ప్రకాశ్, పులివర్తి నాని, ముళ్ళపూడి బాపిరాజు, డా. రవి వేమూరులతో ఛార్లెట్‌లో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ నాయకులు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నారైలు కూడా కృషి చేయాలని కోరారు. చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పులివర్తి నాని మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గంలో టీడిపి గెలవడం ఖాయమని ఈ మేరకు తాను టీడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మాట కూడా ఇచ్చానని చెప్పాడు. టి.డి. జనార్ధన్ మాట్లాడుతూ, టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికా ఇతర దేశాల్లో కూడా ఘనంగా జరుపుతున్నట్లు చెప్పారు.
నగరి నియోజకవర్గానికి చెందిన గాలి భానుప్రకాశ్ మాట్లాడుతూ, తన తండ్రి గాలి ముద్దుకృష్ణమనాయుడుకు నగరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో ఉన్న సత్సంబంధాలతో ఈసారి నగరిలో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయమని చెప్పారు. పశ్చిమగోదావరికి చెందిన ముళ్ళపూడి బాపిరాజు మాట్లాడుతూ, వైఎస్ జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని, దౌర్జన్యాలను చూసి తెలుగుదేశం పార్టీని గెలిపించడం ఖాయమని చెప్పారు. ఎన్నారై టీడిపి నాయకుడు, ఎపిఎన్‌ఆర్‌టీ మాజీ చైర్మన్ రవి వేమూరు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఎన్నారై టీడిపి నాయకులు, కార్యకర్తలు చేసిన ప్రచారం మంచి ఫలితాలను ఇచ్చిందని ఈ ఎన్నికల్లో కూడా ఎన్నారై టీడీపి నాయకులు కార్యకర్తలు ముందుగానే ప్రచారంలోకి దిగితే మరిన్ని స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పారు.
ఛార్లెట్‌లో ఉన్న టీడిపి నాయకులు రమేష్ మూకుళ్ళ, నాగ పంచుమర్తి, బాలాజి తాతినేని, సతీష్ నాగభైరవ, ఠాగూర్ మల్లినేని, తులసీరాం పాశం, దేవ నర్రావుల , మాధురి ఏలూరి తదితరులు ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు. నార్త్ కరోలినా రాష్టం ఛార్లెట్ మరియు ర్యాలీ సిటీ నుంచి పెద్ద ఎత్తున టీడిపి అభిమానులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.