స్వదేశాన్ని వీడి విదేశాల్లో స్థిరపడుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్నది. పారిస్‌లో విడుదల చేసిన ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఔట్‌లుక్ 2024లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. 2022లో 5.6 లక్షల మంది భారతీయులు దేశాన్ని వదిలి అమెరికా, యూకే, కెనడా వంటి ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఓఈసీడీ) సభ్య దేశాల్లో స్థిరపడ్డారు. 2021లో 4.11 లక్షల మంది భారతీయులు ఓసీఈడీ దేశాలకు వలస వెళ్లగా, 2022లో ఈ సంఖ్య 35 శాతం అధికంగా ఉంది. భారతీయుల తర్వాత చైనీయులు(3.2 లక్షల మంది) ఉన్నారు.
2022లో కొత్తగా వలసవెళ్లిన విదేశీయుల్లో భారతీయులే 6.4 శాతం ఉన్నారు. 2022లో అమెరికాకు అత్యధికంగా 1.25 లక్షల మంది, కెనడాకు 1.18 లక్షల మంది, యూకేకు 1.12 లక్షల మంది వలసవెళ్లారు. 2022లో దాదాపు 1.9 లక్షల మంది భారతీయులు దేశ పౌరసత్వాన్ని వదులుకొని ఓఈసీడీ దేశాల పౌరసత్వాన్ని తీసుకున్నారు. ఇది 2021తో పోలిస్తే 40 శాతం అధికం. ఓఈసీడీల్లో పౌరసత్వం పొందిన విదేశీయుల్లో భారతీయులే అధికం.