టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళిని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఘనంగా సన్మానించారు. బంజారాహిల్స్‌లోని లిటిల్ స్టార్స్ అండ్ షీ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్‌రావు, డైరెక్టర్ రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తారు. తెలుగు జాతి ఖ్యాతిని బాహుబలితో కీర్తిని దేశవ్యాప్తం చేస్తే, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు.ఆస్కార్ సాధించినందుకు రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు. రాజమౌళి సినిమాల్లో ఇన్‌స్పిరేషన్, దేశ భక్తి, సామాజిక స్పృహ కనిపిస్తుందన్నారు. ఆయన భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు.
రాజమౌళి మాట్లాడుతూ హరీశ్‌రావు పనితీరుపై ప్రశంసలు కురిపించారు. సిద్ధిపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తాను చూసిన నాటికి, ఇప్పటికీ ఎంతో మార్పు వచ్చిందన్నారు. పనితీరు చూసిన నాటి నుంచి హరీశ్‌రావుకు తాను పెద్ద అభిమానిగా మారానని రాజమౌళి చెప్పారు. అంతకు ముందు మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్ ఎంఎన్ జె ఆసుపత్రిలో రెండేళ్ల పాటు పేషంట్స్ కేరింగ్, సెక్యూరిటీ లాంటి బాధ్యతలని తామే తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.