తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం పట్ల ఎప్పుడూ సానుకూలంగా ఉంటారు. ఆయన ఆశీర్వాదమే మనకు శ్రీరామరక్ష. సినిమా పరిశ్రమకు ఏ కష్టమొచ్చినా ముందుంటాను అని అన్నారు. నా పుట్టినరోజును ఇంత ఘనంగా నిర్వహించిన తెలుగు సినిమా పరిశ్రమకు కృతజ్ఞతలు. నన్ను దీవించడానికి వేలాదిగా అభిమానులు రావడం ఆనందంగా ఉంది. ఇంతమంది అభిమానాన్ని చూరగొనడం నా పూర్వజన్మసుకృతం. ఈ చక్కని ఆత్మీయ వాతావరణం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను అన్నారు. తదనంతరం తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ తన తండ్రిపై రాయించిన ఓ ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు.
ఈ వేడుకల్లో చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షులు దిల్‌రాజు, ప్రముఖ నిర్మాతలు దామోదర ప్రసాద్, సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్, సి.కల్యాణ్, నటులు రఘుబాబు, మాదాల రవి, చిత్రపురి కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనిల్ దొరై, సినీ జర్నలిస్ట్ సంఘం తరపున సురేశ్ కొండేటి, లక్ష్మీనారాయణ, 24 క్రాఫ్ట్స్‌కు సినీ కార్మికులు పాల్గొన్నారు.