కువైట్‌లో భారత్ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాగృతి కువైట్ అధ్యక్షుడు ముత్యాల వినయ్ కుమార్ నేతృత్వంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో మహోన్నత శిఖరాలు అధిరోహించినప్పటికీ మన మూలాలు మరిచిపోవద్దనే సంకల్పాన్ని గట్టిగా నమ్మిన నాయకురాలు కవిత అని కొనియాడారు. ఎమ్మెల్సీ కవితపై జరుగుతున్న రాజకీయ దాడులను ఖండించారు. తప్పుడు కేసులతో కవితను ఇబ్బందులకు గురి చేస్తున్న దుష్టశక్తులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తప్పుడు కేసులతో ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ వాటన్నింటినీ ఎదుర్కొనే సామర్థ్యం తమ నాయకురాలు దగ్గర ఉన్నాయని అన్నారు. త్వరలోనే అన్ని అవరోధాలు, ఆరోపణల నుంచి విముక్తి పొంది నూతన శక్తితో మన ముందుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎటువంటి సంకట స్థితిలో అయిన సరే కవితక్కకు అండగా ఉంటామని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఏ అవసరం ఉన్నా జాగృతి అండగా ఉంటుందని మరోసారి ఆయన తెలియజేశారు.
కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల మాట్లాడుతూ తెలంగాణ బతుకమ్మను, సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత కవితదే అని కొనియాడారు. మహిళలకు కవిత ఒక రోల్ మోడల్‌గా నిలుస్తున్నారని అన్నారు. మహిళా బిల్లు సాధన కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు. ఈ వేడుకలలో ముఖ్య అతిథులుగా కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల, జనరల్ సెక్రటరీ సురేష్ గౌడ్, ఎరుగట్ల జడ్పీటీసీ రాజేష్ గుల్లే, గోల్డెన్ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుభాన్ సోహెల్, కువైట్ తెలంగాణ సమితి అధ్యక్షులు జీకే గంగాధర్, గల్ఫ్ కాపు సంగం కువైట్ అధ్యక్షులు జిలకర మురళి రాయల్ పాల్గొన్నారు.