ఫ్రాన్స్ బస్టీల్ డే వేడుకలకు ముఖ్య అతిధిగా భారత ప్రధాని మోడీ హాజరు కానున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆహ్వానం మేరకు జులై 13, 14 తేదీల్లో మోడీ అక్కడ పర్యటిస్తారు. ఐరోపా లోనే అతిపెద్ద సైనిక కవాతుగా పేరొందిన ఫ్రాన్స్ నేషనల్ డే పరేడ్ జులై 14న పారిస్‌లో జరుగుతుంది. ఆ పరేడ్‌లో మోడీ పాల్గొంటారు. అందులో భారత సైనిక బృందాలు కూడా పాల్గొంటాయి.
ప్రధాని గౌరవార్ధం ఫ్రాన్స్ అధ్యక్షుడు అధికారిక విందుతోపాటు ప్రైవేట్ విందును కూడా ఇవ్వనున్నారు. ఇరువురు నేతలు వివిధ అంశాలపై సుదీర్ఘ చర్చలు జరుపుతారు. ఫ్రాన్స్ ప్రధానితోపాటు సెనెట్, నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుల తోనూ భేటీ అవుతారు. అనంతరం అక్కడి ప్రవాసి భారతీయులు, భారత్, ఫ్రెంచి సంస్థల సీఈవోలు, ఇతర ప్రముఖులతోనూ మోడీ ప్రత్యేకంగా సమావేశం అవుతారు. భారత నేవీ కోసం ఫ్రాన్స్ నుంచి 26 రాఫెళ్లు, 3 సబ్‌మెరైన్ల కొనుగోలుకు సంబంధించిన ఒప్పందం మోదీ పర్యటన సందర్భంగా కుదిరే అవకాశం ఉంది. బస్టీల్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించే మిలటరీ పరేడ్‌లో ఆ దేశ బలగాలతో కలిసి భారత సాయుధ దళాలు కూడా పాల్గొననున్నాయి.