ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం 800. ఎం.ఎస్.శ్రీపతి దర్శకుడు. మురళీధరన్ పాత్రలో స్లమ్‌డాగ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలకానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ను ముంబయిలో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1993లో నేను తొలిసారి మురళీధరన్‌ను కలిశాను. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతున్నది. మురళీధరన్ ఎంతో ఎత్తుకు ఎదిగినా సాధారణ జీవితాన్ని గడుపు తుంటాడు. కెరీర్‌లో ఎన్నో అవరోధాలను అధిగమించి ఆయన విజేతగా నిలిచాడు. పిచ్ ఎలా ఉన్నా బంతిని టర్న్ చేసే ప్రతిభ మురళీధరన్ సొంతం. అతన్ని ఎలా ఎదుర్కోవాలో అని మేము మీటింగ్స్‌లో డిస్కస్ చేసేవాళ్లం అన్నారు. క్రికెట్ చరిత్రలోనే సచిన్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని, ట్రైలర్ ఆవిష్కరణకు ఆయన అతిథిగా రావడం గౌరవంగా భావిస్తున్నానని ముత్తయ్య మురళీధరన్ తెలిపారు. తెలుగులో ఈ సినిమా విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందని చిత్ర సమర్పకులు శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు.