నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం నా సామిరంగ. విజయ్ బిన్ని దర్శకత్వం. ఆషికా రంగనాథ్ కథానాయిక. ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇప్పటికే ఫస్ట్ టీజర్, ఫస్ట్‌సింగిల్‌ను విడుదల చేయగా, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. మా జోలికొస్తే మాకడ్డు వస్తే మామూలుగా ఉండదు,నా సామిరంగ ఈ గీత తొక్కితే మా సేత సిక్కితే మామూలుగా ఉండదు నా సామిరంగ అంటూ కథానాయకుడి మనస్తత్వాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. ఎం.ఎం.కీరవాణి స్వరపరచిన ఈ గీతానికి చంద్రబోస్ సాహిత్యాన్నందించారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. దినేష్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో దాదాపు 300 మంది డ్యాన్స ర్ల పై ఈ పాటను చిత్రీకరించారు. నాగార్జున మాస్ గెటప్‌లో ఆకట్టుకుంటున్నారు. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కలిసి చేసిన డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం సంక్రాంతి బరిలో దిగబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కెమెరా: శివేంద్ర దాశరథి, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కథ, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ.