అక్కినేని నాగార్జున హీరోగా నటించిన చిత్రం నా సామిరంగ. ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. కొరియోగ్రాఫర్ నేపథ్యమున్న విజయ్ బిన్నీ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహ రించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలై చక్కటి టాక్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యం లో తెలుగు ఫిల్మ్, టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ అభినందన సభ ఏర్పాటుచేసింది.
నాగార్జున, అల్లరి నరేశ్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కంగ్రాట్స్ మీట్‌లో నా సామిరంగ చిత్ర బృందాన్ని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. నాగార్జున మాట్లాడుతూ విజయ్ బిన్నీ నా సామిరంగ సినిమాను అంద మైన పాటలా చాలా అద్భుతంగా తీశారని అన్నారు. విజయ్‌తో పనిచేయడం అద్భుత అనుభవాన్ని చ్చింది. మా అందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ కళ్లు మూసి తెరిచేలోగా చక్కగా సినిమాను పూర్తిచేశాడు. ఒక పాటలా చాలా అందంగా తీశాడు. కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. నేను 95కు పైగా సినిమాలు చేశాను. క్లారిటీతో ఉన్న అతికొద్ది మంది దర్శకుల్లో విజయ్ ఒకరు. విజయ్‌కి, డ్యాన్సర్స్ అసోసియేషన్‌కి ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. నాగార్జున గారు ఇచ్చిన ప్రేమను మర్చిపోలేను. ఆయనే నన్ను దర్శకుడిని చేశారు. డైరెక్టర్ కావాలని ఆశపడుతున్న చాలా మంది కొరియోగ్రాఫర్స్‌కి అందరి సపోర్ట్ కావాలి అని దర్శకుడు విజయ్ బిన్నీ అన్నారు. కార్యక్రమంలో శేఖర్ మాస్టర్, సుజాత మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.