మరోసారి జోడీ కట్టారు నాగచైతన్య, కృతిశెట్టి. బంగార్రాజులో ఈ ఇద్దరు నాయకానాయికలు సందడి చేశారు. నాగచైతన్య కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కృతిశెట్టి కథానాయిక. వెంకట్‌ప్రభు దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస సిల్వర్ స్కీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను క్లాప్‌నివ్వగా, రానా దగ్గుబాటి కెమెరా స్విఛాన్ చేశారు. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా, ఆయన తనయుడు యువన్‌శంకర్ రాజా స్వరాల్ని సమకూర్చడం ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది. కమర్షియల్ ఎంటర్ టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది. ఈ సినిమాతో తమిళ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు నాగచైతన్య. వెంకట్ ప్రభు తెలుగులోకి అడుగుపెడుతున్నారు. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతాం. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంభాషణలు: అబ్బూరి రవి, సంగీతం: ఇళయరాజ, యువన్‌శంకర్ రాజా, సమర్పణ: పవన్‌కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం :వెంకట్ ప్రభు.