అగ్ర నటుడు బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ తొలి చిత్రానికి ప్రశాంత్‌వర్మ దర్శకత్వం వహించబోతున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. పౌరాణిక ఇతిహాసం ప్రేరణతో రూపొందించిన ఈ కథలో మోక్షజ్ఞ పాత్రను నవ్యరీతిలో తీర్చిదిద్దబోతున్నారని తెలిసింది. ఇప్పటికే నటన, నృత్యాలు, పోరాటఘట్టాల్లో ప్రత్యేక శిక్షణ పొందిన మోక్షజ్ఞ, లుక్స్, స్టైల్ పరంగా సరికొత్త మేకోవర్‌తో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఇందులో ఆయన ఛార్మింగ్ లుక్స్‌తో కనిపిస్తున్నారు. మోక్షజ్ఞ సోదరి తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.