కేసీఆర్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమని అని టీఆర్ఎస్ పార్టీ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలుపడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్నారైల అందరి తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించడం దేశంలో ఒక మహోజ్వల ఘట్టం పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం దేశ భవిష్యత్‌ను మార్చబోతుందన్నారు. 20 సంవత్సరాల క్రితం సాదాసీదాగా ప్రారంభమైన టీఆర్‌ఎస్ పార్టీ అంచెలంచెలుగా ఎదిగి ఎవరూ అందుకోలేని స్థాయికి చేరిందన్నారు. సమైక్య పాలనను బద్దలు కొట్టి తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన పార్టీ టీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.
రాష్ట్రాన్ని సాధించిన అనంతరం రైతుబీమా, రైతుబంధు, మిషన్ కాకతీయ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం తదితర సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలిపారన్నారు. బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో కేసీఆర్ అడుగుజాడల్లో ముందుకెళ్తామన్నారు. ప్రపంచదేశాల్లో ఉన్న ఎన్నారైలందరినీ ఏకం చేస్తామని, జాతీయ పార్టీని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.