ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన సేవా కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా కొవ్వలిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసింది. కొవ్వలి గ్రామంలో ఏలూరు హేలాపురి రూరల్ లయన్స్ క్లబ్, వెంగి జెమ్స్ లయన్స్ క్లబ్, ఏలూరు ఆయుష్ హాస్పిటల్స్ నాట్స్ ఉచిత వైద్య శిబిర నిర్వహణకు సహాయ సహకారాలు అందించాయి. నాట్స్ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ ఉపాధ్యక్షుడు భాను ప్రకాశ్ ధూళిపాళ్ల చొరవతో ఏర్పాటైన ఈ ఉచిత వైద్య శిబిరంలో దాదాపు 200 మంది పేదలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.
కొవ్వలి గ్రామంలో పేద రోగులందరికి షుగర్, బీపీ, గుండె, కంటి చూపు పరీక్షలు నిర్వహించారు. భాను ప్రకాశ్ ధూళిపాళ్ల చక్కటి సమన్వయంతో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నాట్స్ దిగ్విజయంగా నిర్వహించి స్థానికుల ప్రశంసలు పొందింది. పేద రోగులకు నాట్స్ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడాన్ని స్థానికులు అభినందించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నాట్స్ నాయకుడు భాను ధూళిపాళ్ల చేసిన కృషిని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి ప్రశంసించారు. భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదాన్ని చేతల్లో చూపించిన భాను ప్రకాశ్ ధూళిపాళ్లను నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి అభినందించారు.