ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లిన విదేశీ విద్యార్థులకు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఇప్పటికే వలస (ఇమ్మిగ్రేషన్) విధానాలను మార్చడంతోపాటు స్టడీ పర్మిట్లపై పరిమితి విధించాలని, శాశ్వత నివాస దరఖాస్తుల (పర్మినెంట్ రెసిడెన్సీ నామినేషన్ల) సంఖ్యను కుదించాలని నిర్ణయించడం ద్వారా ఎంతో మంది విదేశీ విద్యార్థులను కష్టాల్లోకి నెట్టిన కెనడా ప్రభుత్వం, తాజాగా ఆఫ్-క్యాంపస్ జాబ్స్‌పై పరిమితి విధించింది. ఇకపై విదేశీ విద్యార్థులు తమ జీవన ఖర్చుల కోసం క్యాంపస్ వెలుపల వారానికి 24 గంటలకు మించి పనిచేయకూడదన్న నిబంధనను ప్రవేశపెట్టింది. ఈ నెల నుంచే ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది. దీంతో లక్షల మంది విదేశీ విద్యార్థులకు, అత్యధికంగా భారతీయ విద్యార్థులకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తలెత్తనున్నాయి.
వాస్తవానికి గతంలో కెనడాలో విదేశీ విద్యార్థులు వారానికి 20 గంటలు మాత్రమే క్యాంపస్ వెలుపల పనులు చేసుకునేందుకు వీలుండేది. కానీ, కొవిడ్ సంక్షోభ సమయంలో అక్కడ కార్మికుల కొరత ఏర్పడటంతో ఈ నిబంధనను తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ వెసులుబాటు గడువు ఈ ఏడాది ఏప్రిల్ 30తో ముగియడంతో ఇప్పుడు కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు.