అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) కోర్సులు చదువుతున్న భారతీయులతో సహా ఇతర దేశాల విద్యార్థులకు కొత్త భయం వెన్నాడుతోంది. చదువులు పూర్తయిన వెంటనే స్వదేశాలకు తిరిగివెళ్లే పరిస్థితి వారికి ఎదురయ్యే అవకాశం ఉంది. ఆప్షనల్ ప్రాక్టికల్ ్రట్రైనింగ్ (ఓపీటీ) వర్క్ ఆథరైజేషన్‌ని రద్దు చేయాలని కోరుతూ పార్లమెంట్‌లో ఓ బిల్లును కొందరు సభ్యులు ప్రవేశపెట్టారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగం వెదుక్కునేందుకు మూడేళ్ల వరకు అమెరికాలో నివసించే అవకాశాన్ని ఓపీటీ కల్పిస్తోంది.

గతంలో అటువంటి ప్రయత్నాలు విఫలమైనప్పటికీ ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన ఇమిగ్రేషన్ చర్యల నేపథ్యంలో ఈ బిల్లు రావడం విదేశీ విద్యార్థులను భయాందోళనకు గురిచేస్తోంది. ఎన్నికల్లో చేసిన వాగ్దానం మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే విదేశీ అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని చేపట్టారు. తాజా పరిణామంతో తమను హెచ్1-బీ వర్క్ వీసాదారులుగా మార్చగల ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న ఎఫ్-1, ఎం-1 స్టూడెంట్ వీసాదారుల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
