దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్ కొత్త రకాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటి వరకు ఏ రకంలోనూ లేని విధంగా ఈ కొత్త రకం కొమ్ముల్లో భారీగా ఉత్పరివర్తనాలు జరిగినట్లు వారు ఆందోళన చెందుతున్నారు. దీన్ని జీ.1.1.529గా గుర్తించామని లండన్ ఇంపీరియల్ కళాశాల వైరాలజిస్ట్ డాక్టర్ టామ్ పీకాక్ తెలిపారు. ఇది ఎంత వేగంగా విస్తృతంగా వ్యాపిస్తుందనే సంకేతాలను వారు గమనిస్తున్నారు. స్పైక్ మ్యుటేషన్లు పెద్దసంఖ్యలో జరుగడం ఆందోళన కలిగించే అంశమని హెచ్చరిస్తున్నారు. ఇది భారీగా వ్యాపించడానికి, ప్రజల రోగ నిరోధకతను తప్పించుకొనేందుకు వైరస్‌కు బలాన్నిస్తుందని విశ్లేషిస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో ఇప్పటికే 22 కొత్త వేరియంట్ కేసులను గుర్తించారు. అర్హులంతా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని, మాస్కులు ధరించాలని, పరిశుభ్రత, భౌతిక దూరం పాటించాలని, గాలి వెలుతురు ధారాళంగా ఉన్న ప్రదేశాల్లోనే సమావేశం కావాలని దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రజలకు సూచించింది. కొత్త వేరియంట్‌పై లండన్‌లో కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.