టాలీవుడ్ యాక్టర్ నితిన్ నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ మాచర్ల నియోజకవర్గం. కృతి శెట్టి కథానాయిక. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక గీతాన్ని సిద్దం చేస్తోంది చిత్ర బృందం. ఇప్పుడీ పాట కోసం బాలీవుడ్ భామ ఊర్వశీ రౌటేలాను రంగంలోకి దింపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర బృందం ఆమెతో సంప్రదింపులు పూర్తి చేసిందని, నితిన్‌తో ప్రత్యేక గీతంలో ఆడిపాడేందుకు అంగీకరించిందని ప్రచారం వినిపిస్తోంది. విభిన్నమైన రాజకీయ నేపథ్యకథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో నితిన్ మాస్ లుక్‌లో కనిపించనున్నారు. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ చూస్తుండగా, కోటిగిరి వెంకటేశ్వర్ రావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. నితిన్ హోం బ్యానర్ శ్రేష్ట్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం గతంలో ప్రకటించింది. మరి ఇప్పుడు అదే తేదికి వస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.